జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా పారా క్రీడల్లో భారత పారా జూడో క్రీడాకారిణి కోకిల అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల జే2 విభాగం 52 కిలోల కేటగిరీ సెమీఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, చైనాకు చెందిన లియు యీని ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో కోకిలకు కనీసం రజత పతకం ఖాయమైంది.
ఫైనల్లో విజయం సాధిస్తే స్వర్ణ పతకం కూడా ఆమె ఖాతాలో చేరుతుంది. న ఐచినగోయాలో జరిగిన సెమీఫైనల్ పోరులో కోకిల ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. నిర్ణయాత్మక దశలో అదనపు స్కోరుతో విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నారు.
ఉత్కంఠభరిత సెమీఫైనల్ పోరు
ఈ పోటీలో ఆమె వాజా-ఆరి, యుకో పాయింట్లు సాధించగా, లియు యీ కూడా పాయింట్లు సాధించడంతో పోరు ఉత్కంఠగా సాగింది. చివరకు కోకిల విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. దృష్టి లోపం ఉన్న క్రీడాకారిణుల కోసం నిర్వహించే జే2 విభాగంలో కోకిల పోటీపడుతున్నారు.
గత విజయాలు
గత ఆసియా పారా క్రీడల్లో హాంగ్జౌలో జరిగిన పోటీల్లో ఆమె 48 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించారు. పారిస్ 2024 పారాలింపిక్స్‌లోనూ భారత బృందానికి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి బరువు విభాగాన్ని మార్చి పోటీపడుతూ ఫైనల్‌కు చేరడం ఆమె కెరీర్లో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.
కపిల్ పర్మార్‌కు కాంస్యంపై ఆశలు
పురుషుల జే1 విభాగం 70 కిలోల సెమీఫైనల్లో భారత క్రీడాకారుడు కపిల్ పర్మార్ ఇండోనేషియాకు చెందిన జునైదీ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన కాంస్య పతకం కోసం జరిగే పోటీలో పాల్గొననున్నారు. అంతకుముందు మంగోలియాకు చెందిన బాతార్సురెన్ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకున్నారు.
కోకిల ఫైనల్లో కిర్గిజిస్థాన్‌కు చెందిన ఐబికే ఉలాన్బెక్ కిజీతో తలపడనున్నారు. ఈ పోరులో గెలిస్తే ఆమెకు స్వర్ణ పతకం లభిస్తుంది. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన కోకిలపై భారత క్రీడాభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

