నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ (NMET) కింద ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో ఈ అంశంపై ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్‌సభలో అందించిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ, అభివృద్ధి కోసం మొత్తం 289 ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో 273 ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతి లభించగా, మరో 16 ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం 1729.35 కోట్ల నిధులు కేటాయించగా, 922.83 కోట్ల నిధులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 5 ప్రాజెక్టులకు అనుమతి లభించింది, మరో ప్రాజెక్టు ప్రతిపాదన దశలో ఉంది. ఈ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు జియో మెరైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిటికల్ మినరల్ ట్రాకర్, మైనింగ్ టెక్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి మూడు ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.
దేశంలో అత్యధికంగా 43 ప్రాజెక్టులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, 32 ప్రాజెక్టులతో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనుమతించిన ప్రాజెక్టులకు 66.67 కోట్ల నిధులు కేటాయించగా, 30.15 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయని, ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం కార్యాచరణలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.


