కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల స్థాయిని పెంచాలని, పడకల సంఖ్యను 300కు చేర్చాలని కోరుతూ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చారు.
కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో గురువారం కలిశారు. కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల స్థాయిని పెంచాలని, పడకల సంఖ్యను 100 నుంచి 300కు పెంచాలని ఆయన ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం మూడు నియోజకవర్గాల ప్రజలు ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని, పెరుగుతున్న జనాభా దృష్ట్యా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంత అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే వివరించారు. పడకలతో పాటు ఇతర వైద్య సదుపాయాలను కూడా మెరుగుపరచాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆసుపత్రి స్థాయిని పెంచేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి హామీతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు.


