విశ్వంలో జీవం ఎలా సాధ్యమవుతోంది భూమిపై జీవులు మనుగడ సాగించడానికి అవసరమైన పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రానికి సంబంధించిన కొత్త పరిశీలన కీలకమైన దిశను చూపిస్తోంది. విశ్వంలోని కొన్ని ప్రాథమిక భౌతిక స్థిరాంకాలలో స్వల్ప మార్పులు జరిగినా, ద్రవాల ప్రవాహ లక్షణాలు మారి జీవ ప్రక్రియలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని పరిశోధన సూచిస్తోంది.

ద్రవాల ప్రవాహం.. జీవానికి కీలకం
ద్రవాలు ఎంత సులభంగా ప్రవహిస్తాయో తెలిపే లక్షణాన్ని స్నిగ్ధత అంటారు. నీరు తేలికగా ప్రవహిస్తే, తేనె వంటి ద్రవాలు నెమ్మదిగా కదులుతాయి. జీవకణాల లోపల, వాటి మధ్య పదార్థాల రవాణా సజావుగా సాగడానికి ద్రవాల ప్రవాహ లక్షణాలు కీలకంగా ఉంటాయి. ఈ లక్షణాలను విశ్వంలోని ప్రాథమిక భౌతిక స్థిరాంకాలు ప్రభావితం చేయగలవని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి, విద్యుత్ ఆవేశం, ప్లాంక్ స్థిరాంకం వంటి పరిమాణాలు అణువుల ప్రవర్తన నుంచి రసాయన బంధాల వరకు అనేక అంశాలను ప్రభావితం చేస్తాయి. వీటి విలువలు భిన్నంగా ఉంటే విశ్వంలో పదార్థాల లక్షణాలు కూడా మారే అవకాశం ఉంది. అలాంటి మార్పులు ద్రవాల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తే, జీవకణాల పనితీరుకు అవసరమైన ప్రక్రియలు దెబ్బతినవచ్చని అధ్యయనం వివరిస్తోంది.
జీవానికి అనుకూలమైన విశ్వం ఎందుకు
లండన్లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త కొస్త్యా ట్రాచెంకో ఈ అంశంపై సైద్ధాంతిక విశ్లేషణ చేపట్టారు. ఆయన పరిశోధన సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనాల ఆధారంగా, జీవానికి అనుకూలమైన ద్రవ ప్రవాహ పరిస్థితులు ఏర్పడటంలో ప్రాథమిక భౌతిక స్థిరాంకాల పాత్రను పరిశీలించింది.
అయితే, విశ్వంలోని ఈ స్థిరాంకాలు కాలక్రమంలో మారుతున్నాయని లేదా జీవం ఏర్పడటానికి అవే ఏకైక కారణమని పరిశోధకులు నిర్ధారించలేదు. వాటికి ప్రస్తుత విలువలు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నకు కూడా ఇంకా స్పష్టమైన సమాధానం లేదు.
ఈ పరిశోధన జీవం ఆవిర్భావంపై ఉన్న శాస్త్రీయ సందేహాలను పూర్తిగా పరిష్కరించకపోయినా, విశ్వంలోని భౌతిక నియమాలు జీవానికి అనుకూల పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి మరో మార్గాన్ని సూచిస్తోంది.
మొత్తంగా, నీరు ప్రవహించడం, రక్త ప్రసరణ జరగడం వంటి సాధారణ ప్రక్రియల వెనుక కూడా విశ్వంలోని ప్రాథమిక భౌతిక నియమాల ప్రభావం ఉండవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. జీవం ఎందుకు సాధ్యమవుతోందన్న శాస్త్రంలోని అతిపెద్ద ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నంలో ఇది మరో ముందడుగు.