నెల్లూరు గ్రామీణం, 2026-11-29
నెల్లూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్ది, స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం క్రమంగా సాకారమవుతోందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
నెల్లూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్ది, స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం క్రమంగా సాకారమవుతోందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆదివారం నెల్లూరులోని నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ లో స్మార్ట్ టైల్ సంస్థ రూపొందించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ గ్రేడ్ ఐక్యూ సాఫ్ట్వేర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఆరు, ఏడేళ్ల క్రితం నెల్లూరులో టెర్రా లాజిక్ వంటి సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటైందని, ప్రస్తుతం చికాగోకు చెందిన సంస్థతో పాటు మరిన్ని ఐటీ కంపెనీలు నెల్లూరు వైపు అడుగులు వేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు రావాలన్నారు. బట్టీ పట్టే విద్యకు బదులుగా విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం, మేధోశక్తి, విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల జవాబు పత్రాలను విశ్లేషించి, వారు ఏ అంశంలో వెనుకబడి ఉన్నారో గుర్తించి, ఆయా అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించడమే డీప్ గ్రేడ్ ఐక్యూ ప్రత్యేకత అని ఆయన వివరించారు. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు అభ్యసన సామర్థ్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణతో పాటు ముస్లిం సమాజ విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలీమ్-ఏ-హునర్ కార్యక్రమం ద్వారా ప్రతిభా పరీక్ష నిర్వహించి 250 మంది విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్య అందిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న పేద ముస్లిం విద్యార్థులకు ఏఐ ఆధారిత ఫౌండేషన్ కోర్సులు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని ఆయన కొనియాడారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కృషితో నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలలు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని ఆయన తెలిపారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కోసం మంత్రి నారాయణ రూ.20 కోట్ల సీఎస్ఆర్ నిధులను సమకూర్చారని ఆయన పేర్కొన్నారు. విద్యకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో అందించాలని ఆయన ఐటీ సంస్థలకు సూచించారు. లక్ష మంది పేద విద్యార్థులకు రూ.1.50 కోట్ల విలువైన సబ్స్క్రిప్షన్లను ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సాఫ్ట్వేర్ ప్రయోజనాలపై ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌తో మాట్లాడానని, త్వరలో సంబంధిత అధికారులతో సమావేశమై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా పోటీపడే స్థాయికి ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతతో నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు యువత రాణిస్తున్నారని, అదే తరహాలో కృత్రిమ మేధస్సును సద్వినియోగం చేసుకొని భావితరాల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మేడ్ ఇన్ నెల్లూరు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్‌గా ఈ సాఫ్ట్వేర్ గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తూ, సంస్థ ప్రతినిధులకు అబ్దుల్ అజీజ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.





