** (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 16
సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి, కృష్ణా డెల్టా పరిధిలోని శివారు ప్రాంత భూములకు నీరు సక్రమంగా అందకపోవడంతో, రైతులు దెందులూరు మండలం సత్యనారాయణపురంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. బీటలు వారిన వరి నారుమడిలో మట్టి గడ్డలను చేతబట్టి, 'నీరు అందదు.. సాగు సాగదు' అంటూ నినాదాలు చేశారు.
సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి, కృష్ణా డెల్టా పరిధిలోని శివారు ప్రాంత భూములకు నీరు సక్రమంగా అందకపోవడంతో, ఆవేదన వ్యక్తం చేసిన రైతులు గురువారం దెందులూరు మండలం సత్యనారాయణపురంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. బీటలు వారిన వరి నారుమడిలో మట్టి గడ్డలను చేతబట్టి, 'నీరు అందదు.. సాగు సాగదు' అంటూ నినాదాలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, సాగునీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ, కాలువల్లో గుర్రపు డెక్క, తూడు, నాచు పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయని, వీటిని తొలగించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
నిరసనకు ముందు, కొవ్వలి మరియు పోతునూరు గ్రామాలలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. కేవలం దెందులూరు నియోజకవర్గంలోనే సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పట్టిసీమ కాలువ ద్వారా నీటిని కృష్ణా, గోదావరి డెల్టాలకు మళ్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలను కాపాడటానికి యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి. తవుడు, ఎస్. సత్తియ్య, ఏ. అప్పలస్వామి, జి. శివతో పాటు పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.










