ఏలూరు, 2026-07-16
చింతలపూడి మండల కేంద్రంలోని శశి స్కూల్లో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంగణంలోనే విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నారని, ఇది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చింతలపూడి మండల కేంద్రంలోని శశి స్కూల్లో నిర్మాణ పనులు కొనసాగుతుండగానే విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్న ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యాజమాన్యం నిర్లక్ష్యమని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టేనని మండిపడ్డారు.
ఒకవైపు భారీ నిర్మాణ పనులు జరుగుతుండగా, మరోవైపు అదే ప్రాంగణంలో చిన్నారులతో తరగతులు నిర్వహించడం అత్యంత ప్రమాదకరమని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇనుప రాడ్లు, ఇటుకలు, సిమెంట్, నిర్మాణ సామగ్రి మధ్య విద్యార్థులు తిరగాల్సిన పరిస్థితి కల్పించడం దారుణమని విమర్శించారు. ప్రమాదకర పరిస్థితుల్లో అదే ప్రాంతంలో విద్యార్థులను ఉంచి పాఠాలు చెప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు.
భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల కోసం పిల్లల భద్రతను పణంగా పెట్టడం సరికాదని హెచ్చరించారు.
వెంటనే విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారి, సంబంధిత అధికారులు శశి స్కూల్‌ను తనిఖీ చేసి, నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు తరగతులను నిలిపివేయాలని లేదా విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా పూర్తిస్థాయి భద్రత కలిగిన ప్రదేశంలో బోధన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన తర్వాత విచారణలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం కాదు… ప్రమాదం జరగకుండా ముందే నివారించడమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి ప్రాణం అమూల్యమని, దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.











