జంగారెడ్డిగూడెం, జూన్ 27
వర్జీనియా పొగాకుకు కిలోకు రూ. 500 మద్దతు ధర కల్పించాలని, పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
వర్జీనియా పొగాకుకు కిలోకు రూ. 500 మద్దతు ధర చెల్లించి, ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు పోరండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కారం రాఘవ మాట్లాడుతూ.. రైతులు లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పొగాకును, బయ్యర్లు సాకులు చూపి గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. పొగాకు ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వస్తున్నా, రైతుల దీనావస్థను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రూ. 1,000 కోట్ల నిధులు కేటాయించి పొగాకు కొనుగోలు చేపట్టాలని, తద్వారా బయ్యర్లు కూడా కొనుగోలుకు ముందుకు వస్తారని వారు డిమాండ్ చేశారు.
రైతులు ఉద్దండం వెంకటేశ్వరరావు, కాకర్ల వీర రాఘవలు మాట్లాడుతూ.. కూలీలు, కౌలు రేట్లు పెరిగి కిలో పొగాకు ఉత్పత్తికి రూ. 350 పైనే ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ధరలకే పంటను కొనుగోలు చేయాలని వారు కోరారు.
ధర్నాలో ఐఎఫ్టీయూ (IFTU) జిల్లా అధ్యక్షులు కె.వి. రమణ మాట్లాడుతూ, పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీని ఆధునిక సాంకేతికతతో అదే స్థలంలో కొత్తగా నిర్మించుకోవడానికి ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం స్వంత నిధులతో నిర్మించాలనుకుంటున్న ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వకుండా జాప్యం చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘం జాతీయ కన్వీనర్ సరియం రామ్మోహన్, పీఓడబ్ల్యూ (POW) జిల్లా ప్రధాన కార్యదర్శి కే. లత, పీవైఎల్ (PYL) జిల్లా కన్వీనర్ కెచ్చెల పోతిరెడ్డి, పీడీఎస్యూ (PDSU) జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఏలూరు రోడ్డు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి, ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి వెంకటేశ్వరరావు, ఈ. భూషణం, ముసలా రెడ్డి, కట్టం నాగేశ్వరరావు తదితర రైతు నాయకులు పాల్గొన్నారు.









