నాగర్కర్నూల్, 27 June
అల్లుడితో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే భార్య దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. మొదట గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించినా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో చోటుచేసుకుంది.
అల్లుడితో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే భార్య దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. మొదట గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించినా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో చోటుచేసుకుంది.
ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతుల కూతురిని ఆంజనేయులు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇంటికి అల్లుడిగా వచ్చిన ఆంజనేయులతో అత్త అలివేలుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భర్త యాదయ్య.. భార్యను, అల్లుడిని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో తన సుఖానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన అలివేలు అతన్ని వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.
ఈ నెల 23న యాదయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భర్త చనిపోగానే అలివేలు అనారోగ్యంతో, గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియలకు ముందు యాదయ్య శరీరం, మర్మాంగంపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చింది. యాదయ్య అన్న కుమారుడు పరశురాములు తిమ్మాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు అలివేలును విచారించగా.. అల్లుడితో తనకున్న వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కక్షతో భర్త యాదయ్య మర్మాంగాలపై దాడి చేసి హత్య చేసినట్లు అంగీకరించింది. యాదయ్య మరణించిన రోజే ఆయన కూతురు, అల్లుడు ఆంజనేయులు కూడా ఆవంచ గ్రామంలోని వారి ఇంటికి వచ్చి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ హత్యలో అల్లుడి పాత్రతో పాటు కూతురి ప్రమేయం కూడా ఉందేమోనని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు నిందితురాలైన భార్య అలివేలును అరెస్ట్ చేసి, ఈ దారుణంలో అల్లుడు ఆంజనేయుల హస్తం ఎంతవరకు ఉందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను కాటికి పంపిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.











