చీరాల, ఆగస్టు 3, 2026
చీరాల తహశీల్దార్ కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పన, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలాని సోమవారం వినతిపత్రం సమర్పించారు.
చీరాల మండలం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలాని పలు ప్రజా సమస్యలపై తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే మహిళలకు సరిపడా మరుగుదొడ్ల సౌకర్యం లేదని, ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి వచ్చినప్పుడు కూర్చునేందుకు కనీస సౌకర్యాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కార్యాలయంలో వెంటనే కుర్చీలు, బెంచీలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
అలాగే చీరాల పట్టణంలో మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉండటంతో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతోందని ఆయన తెలిపారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కార్యాలయంలో అందజేశారు.











