బాపట్ల, 2026-08-31
బాపట్ల జిల్లా ఇంకొల్లు పరిధిలోని పావులూరు జెడ్పీ హైస్కూల్ నందు విద్యార్థిని విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శక్తి యాప్ ప్రాముఖ్యత, సైబర్ నేరాలపై అప్రమత్తత, ఫోక్సో చట్టం, సెల్ఫ్ డిఫెన్స్ వంటి అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు.
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పి మోయిన్ సూచనలతో ఇంకొల్లు పరిధిలోని పావులూరు జెడ్పీ హైస్కూల్ నందు విద్యార్థిని విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇంకొల్లు సీఐ రామా నాయక్, ఎస్సై సురేష్ మార్గదర్శకాలతో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం కానిస్టేబుల్ కే. సుబ్బారావు నిర్వహించారు.
ఈ సందర్భంగా శక్తి యాప్ గురించి వివరిస్తూ, అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు అరికట్టేందుకు కూడా ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరిస్తూ, తమను ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు.
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో, విద్యార్థులు సోషల్ మీడియాలో (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) వచ్చే నకిలీ వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112, 181, 1091, 1098కు కాల్ చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే, ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఫోక్సో చట్టం (చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం) గురించి, మహిళల రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరికనపల్లి సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










