Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 03
చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్చార్జి ఎస్సై ఏ. హరిబాబు విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, ఆపరేషన్ దండాయన్ ద్వారా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేధింపులపై వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో, దృఢ సంకల్పంతో విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అదే సమయంలో మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, మహిళలపై వేధింపుల వంటి సామాజిక సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్చార్జి ఎస్సై ఏ. హరిబాబు సూచించారు.
చీరాల మున్సిపల్ పరిధిలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మొయిన్ పర్యవేక్షణలో, వన్‌టౌన్ సీఐ జి. సోమశేఖర్ సూచనలతో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ గారపాటి మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుడ్ టచ్–బ్యాడ్ టచ్, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రతతో పాటు ఆపరేషన్ దండాయన్ ద్వారా మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై హరిబాబు మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, బస్సు స్టాప్‌లు, ప్రజా ప్రదేశాలు, సామాజిక మాధ్యమాల్లో జరిగే ఈవ్‌టీజింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, వెంటపడటం, బెదిరింపులు వంటి వేధింపులను సహించకుండా వెంటనే శక్తి యాప్ ఎస్ఓఎస్ లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, మహిళలపై వేధింపులు విద్యార్థినుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.
ఆపరేషన్ దండాయన్లో భాగంగా విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండడమే కాకుండా, వాటికి సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు.
చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, చట్టాలపై అవగాహనతో తమ హక్కులను తెలుసుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శక్తి టీం కానిస్టేబుల్ కే. సుబ్బారావు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ గారపాటి మంజుల, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











