బాపట్ల, 2026-07-02
మాదిగలకు చెందిన పట్టా భూమిని ఆక్రమించి, శాశ్వత కట్టడాలు నిర్మించిన వైసిపి నేత బొగ్గుల శ్రీనివాసరెడ్డి ముఠాను ల్యాండ్ గ్రాబింగ్ చట్టప్రకారం అరెస్టు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
మాదిగలకు చెందిన పట్టా భూమిని ఆక్రమించి, శాశ్వత కట్టడాలు నిర్మించిన వైసిపి నేత బొగ్గుల శ్రీనివాసరెడ్డి ముఠాను ల్యాండ్ గ్రాబింగ్ చట్టప్రకారం అరెస్టు చేయాలని దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణను దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. గురువారం అద్దంకిలోని అంబేద్కర్ భవన్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన అనుపర్తి షడ్రక్ అనే మాదిగ కులానికి చెందిన వ్యక్తికి సర్వేనెంబర్ 83/1లో గల 52 సెంట్ల భూమిలో 26 సెంట్లు ఆక్రమించినట్లు నీలం తెలిపారు. హద్దులు మార్చి, అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఈ 26 సెంట్ల భూమిలో వేబ్రిడ్జి, డైరీ ఫార్మ్ నిర్మించారని ఆరోపించారు. బాధితులు చాలాకాలంగా రెవెన్యూ, పోలీస్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని పేర్కొన్నారు.
గత నెల 17వ తేదీన తాళ్లూరు పోలీస్ స్టేషన్లో అనుపర్తి షడ్రక్ భార్య ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 44/26తో మొక్కుబడిగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని, అయితే ఈ కేసులో ఎస్సీల భూమిని ఇతర కులాలవారు ఆక్రమిస్తే వర్తించే సెక్షన్లు 4(ఎఫ్), 4(జి)లను తాళ్లూరు ఎస్సై మల్లికార్జున్ ఉద్దేశపూర్వకంగా నమోదు చేయలేదని విమర్శించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విచారించిన దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ, ఈ కేసును ల్యాండ్ గ్రాబింగ్గా మారుస్తూ ఆల్టర్ మెమో వేయలేదని ఆరోపించారు.
వైసిపి నేత బొగ్గుల శ్రీనివాసరెడ్డి, అతని భార్య నాగమణి, కొడుకు సమరసింహారెడ్డి, భూమి రికార్డుల తారుమారుకు, అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన వెన్నపూస ఆదిలక్ష్మి, వెన్నపూస పేరురెడ్డి తదితరులను ల్యాండ్ గ్రాబింగ్, చీటింగ్, ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయకుండా, దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ వైసిపి భూ ఆక్రమణ ముఠాకు అండగా నిలుస్తున్నారని నీలం నాగేంద్రరావు ఆరోపించారు.
ఆదివారం లోపు బొగ్గుల శ్రీనివాసరెడ్డి ముఠాను అరెస్టు చేయకుంటే సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని నీలం తెలిపారు. అరెస్టు చేయని పక్షంలో దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని దళిత నేత తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, మాదిగ పరిరక్షణ సమితి కన్వీనర్ బంగారం, ఎర్రమల శ్రీను, బాధితులు షడ్రక్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.








