వైద్యులు, ఆసుపత్రులు తమ సేవలను ప్రచారం చేసుకునే విధానంపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తప్పుడు ప్రచారం, అతిశయోక్తి ప్రకటనలు, నకిలీ సమీక్షలను నియంత్రించడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశ్యం. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయని ఎన్ఎంసీ ప్రకటించింది.
వైద్య రంగంలో తప్పుడు ప్రచారం, అతిశయోక్తి ప్రకటనలు, నకిలీ సమీక్షలు, రోగుల అనుభవాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని నియంత్రించేందుకు ఎన్ఎంసీ ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. సామాజిక మాధ్యమాలు, వీడియోలు, ప్రముఖుల ప్రచారం, కృత్రిమ మేధస్సుతో రూపొందించే ప్రకటనలు కూడా వీటి పరిధిలోకి వస్తాయి. వైద్య సేవలపై ప్రజలకు వాస్తవమైన, ధ్రువీకరించగల సమాచారమే అందాలని, రోగులను ఆకర్షించేందుకు తప్పుదోవ పట్టించే ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది.
నంబర్ వన్ డాక్టర్ వంటి ప్రకటనలకు అడ్డుకట్ట
వైద్యులు తమను తాము అత్యుత్తమ వైద్యుడు, నంబర్ వన్ స్పెషలిస్ట్, వంద శాతం విజయం, గ్యారంటీ చికిత్స, అద్భుత నివారణ వంటి పదాలతో ప్రచారం చేసుకోవడంపై ఆంక్షలు విధించారు. ఇలాంటి ప్రకటనలకు విశ్వసనీయమైన, నిష్పాక్షిక ఆధారాలు ఉండాలి. నిరూపించలేని లేదా రోగుల్లో అవాస్తవ అంచనాలు కలిగించే వాదనలు చేయకూడదు. తాము ఎన్ని శస్త్రచికిత్సలు చేశామనే సంఖ్యలు, చికిత్సలో సాధించిన విజయాల వివరాలు లేదా వ్యక్తిగత ఘనతలను అతిశయోక్తిగా ప్రచారం చేయడంపైనా పరిమితులు ఉంటాయి.
రోగుల సమీక్షలు, ప్రముఖుల ప్రచారంపై నియంత్రణ
వైద్యులు, ఆసుపత్రులు తమ సేవల ప్రచారం కోసం రోగుల ప్రశంసలు, అనుభవాలు, సిఫారసులు లేదా సమీక్షలను కోరడం, కొనుగోలు చేయడం, తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడకూడదు. ప్రముఖులు, సామాజిక మాధ్యమ ప్రభావశీలులు, ఉద్యోగులు లేదా ఇతర వ్యక్తుల ద్వారా వైద్య సేవలను ప్రచారం చేయించడంపైనా ఆంక్షలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో నకిలీ అనుచరులు, ఇష్టాలు, వీక్షణలు, వ్యాఖ్యలు, రేటింగ్లు కొనుగోలు చేయడం లేదా చెల్లింపుల ద్వారా శోధన ఫలితాల్లో మెరుగైన స్థానం పొందేందుకు ప్రయత్నించడం కూడా నిబంధనలకు విరుద్ధం. రోగులను ఆకర్షించేందుకు కృత్రిమంగా ప్రజాదరణ సృష్టించే చర్యలను కమిషన్ నియంత్రించనుంది.
కృత్రిమ మేధస్సుతో చేసే ప్రచారాలకూ వర్తింపు
ప్రస్తుతం వైద్య రంగంలో కృత్రిమ మేధస్సుతో వీడియోలు, చిత్రాలు, ప్రకటనలు రూపొందించే ధోరణి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏఐ సాయంతో రూపొందించిన లేదా ఏఐ సహకారంతో తయారు చేసిన ప్రచార సమాచారాన్నీ కొత్త మార్గదర్శకాలు పరిగణనలోకి తీసుకుంటాయి. వైద్య సేవల ప్రచారం కోసం కల్పిత రోగుల అనుభవాలు, నకిలీ చికిత్స ఫలితాలు లేదా వాస్తవం కాని విజయగాథలను రూపొందించి ప్రచారం చేయకూడదు. శస్త్రచికిత్సకు ముందు, తర్వాత తీసిన చిత్రాలను వాణిజ్య ప్రచారానికి ఉపయోగించడం, ప్రముఖులు చికిత్స పొందిన విషయాన్ని ప్రచార సాధనంగా మార్చడం వంటి చర్యలపైనా ఆంక్షలు ఉన్నాయి.
వైద్యులు సామాజిక మాధ్యమాలను పూర్తిగా వినియోగించకూడదని ఈ నిబంధనలు చెప్పడం లేదు. ప్రజారోగ్య అవగాహన, వ్యాధుల నివారణ, ఆరోగ్య విద్య, శాస్త్రీయ చర్చలు, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవచ్చు. అయితే ఈ సమాచారం వాస్తవాధారంగా ఉండాలి. వ్యక్తిగత వైద్య సేవలను ప్రచారం చేయడం లేదా రోగులను ఆకర్షించడమే లక్ష్యంగా ఉండకూడదు. వైద్యులు కొత్తగా ప్రాక్టీస్ ప్రారంభించడం, వైద్య విధానంలో మార్పు, చిరునామా మార్పు, తాత్కాలికంగా విధులకు దూరంగా ఉండటం లేదా తిరిగి విధుల్లో చేరడం వంటి అధికారిక సమాచారాన్ని కూడా ప్రకటించవచ్చు. ఆసుపత్రులు తమ పేరు, సంప్రదింపు వివరాలు, అందుబాటులో ఉన్న విభాగాలు, నిర్ధారణ పరీక్షలు, అత్యవసర సేవలు, గుర్తింపు వివరాలు, ఇతర సదుపాయాలు, వర్తించే ఫీజుల వంటి వాస్తవ సమాచారాన్ని అందించవచ్చు. అయితే నిరూపించలేని గొప్పతనపు వాదనలకు అవకాశం ఉండదు.


