భారతదేశంలో రిటైల్ రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. జేఎల్ఎల్ నివేదిక ప్రకారం, 2030 నాటికి దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో సుమారు 43.7 మిలియన్ చదరపు అడుగుల కొత్త రిటైల్ స్థలం అందుబాటులోకి రానుంది. పెరుగుతున్న వినియోగదారుల కొనుగోలు శక్తి, షాపింగ్ మాల్స్‌కు పెరుగుతున్న ఆదరణ దీనికి ప్రధాన కారణాలు.
ఈ లీజింగ్‌లో ఢిల్లీ-ఎన్సీఆర్ 26 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, ముంబై 25 శాతం, బెంగళూరు 21 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు నగరాలు కలిపి మొత్తం లీజింగ్‌లో సుమారు 72 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
రిటైల్ స్థలాల డిమాండ్‌లో ఫ్యాషన్, దుస్తుల విభాగం 31 శాతం వాటాతో ముందుండగా, ఆహారం, పానీయాల విభాగం 18 శాతం, వినోద రంగం 15 శాతం వాటాను నమోదు చేశాయి. అంతర్జాతీయ బ్రాండ్లు భారత మార్కెట్‌పై ఆసక్తి పెంచుకుంటున్నాయి. 2026 తొలి తొమ్మిది నెలల్లో ఇప్పటికే 24 విదేశీ బ్రాండ్లు భారత్‌లో తమ తొలి స్టోర్లను ప్రారంభించాయి.
రిటైల్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు, వినోద కేంద్రాల నిర్మాణం కీలకంగా మారుతోంది. రానున్న రోజుల్లో దేశీయ వినియోగదారుల కొనుగోలు ధోరణులు, విదేశీ బ్రాండ్ల ప్రవేశం భారత రిటైల్ రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి మరింత దోహదపడనున్నాయని నివేదిక పేర్కొంది.


