ఏలూరు, 2026-11-14
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు మరో ముందడుగు పడనుంది. ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలో రిలయన్స్ సంస్థ సుమారు రూ.43 వేల కోట్ల పెట్టుబడితో భూగర్భ బొగ్గు నుంచి గ్యాస్ తయారు చేసే భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు మరో ముందడుగు పడనుంది. ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలో రిలయన్స్ సంస్థ సుమారు రూ.43 వేల కోట్ల పెట్టుబడితో భూగర్భ బొగ్గు నుంచి గ్యాస్ తయారు చేసే భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. భూగర్భంలో ఉన్న బొగ్గును వెలికితీయకుండా, అక్కడే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో గ్యాస్‌గా మార్చే అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ విధానంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందని, పెట్టుబడులు సుమారు రూ.2.7 లక్షల కోట్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా సుమారు 40 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని భావిస్తున్నారు.
ప్రాజెక్టు పనులను రెండు దశల్లో చేపట్టనున్నట్లు సమాచారం. తొలిదశలో భూగర్భ పరిస్థితులు, బొగ్గు నిల్వలు, భౌగోళిక అనుకూలతలపై అధ్యయనాలు నిర్వహించనున్నారు. రెండో దశలో అవసరమైన అనుమతులు, సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన అనంతరం ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఏలూరు జిల్లా పారిశ్రామిక రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోవడంతో పాటు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.






