పర్చూరు, 2026-11-15
రెండు కిడ్నీలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడికి చీరాల ఎన్.ఆర్. పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. తమవంతుగా రూ.52,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని చీరాల ఎన్.ఆర్. పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరోసారి నిరూపించారు. రెండు కిడ్నీలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నిరుపేద యువకుడికి తమవంతు సహాయాన్ని అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసుల పవన్ కుమార్ (38) అవివాహితుడు. ఆయన రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ మార్పిడి (రీప్లేస్మెంట్) చికిత్సకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఇంతటి భారీ వైద్య ఖర్చును భరించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో పవన్ కుమార్ తనకు తోచినంత ఆర్థిక సహాయం అందించి ప్రాణాలు కాపాడాలని దాతలను, బంధువులను, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
ఈ క్రమంలో పవన్ కుమార్ తన మిత్రుడి ద్వారా చీరాల ఎన్.ఆర్. పి.ఎం. హైస్కూల్ గ్రౌండ్లోని వాకర్స్ అసోసియేషన్ సభ్యులను సంప్రదించి తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆయన దీనస్థితిని తెలుసుకున్న వాకర్స్ అసోసియేషన్ సభ్యులు చలించిపోయారు. వెంటనే స్పందించి, తమ వాకింగ్ సభ్యుల సహకారంతో విరాళాలను సేకరించారు. ఈ విధంగా సమకూరిన రూ.52,500 నగదు మొత్తాన్ని పవన్ కుమార్కు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పవన్ కుమార్కు అవసరమైన వైద్య చికిత్స అందించడానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయని, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమవంతు సహాయ సహకారాలు అందించి ఆయనకు ప్రాణదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
చిన్న మొత్తమైనా ఆపదలో ఉన్నవారికి అందించే సహాయం ఎంతో విలువైనదని చాటిచెప్పిన వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సేవాభావాన్ని పలువురు అభినందించారు. పవన్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ, కార్యదర్శి చారగుళ్ల గురుప్రసాద్, ముంగిర శ్రీనివాసరావు, గెల్లి తుకారాం, గుర్రం బదరీనాథ్, గుద్దంటి రమేష్, శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వెంకటేశ్వరరావు, మోహనరావుతో పాటు నూతలపాడు గ్రామానికి చెందిన పవన్ కుమార్ స్నేహితులు పాల్గొన్నారు.





