బాపట్ల, 2026-11-20
బాపట్ల శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ముగింపు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీమతి యం .హాసిని, మండల విద్యాశాఖ అధికారి శ్రీ డి. ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే పలు సూచనలు చేశారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీమతి యం .హాసిని మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు మన దేశానికి చెందిన వివిధ రంగాలలో విజయం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. క్లాస్ పుస్తకాలతో పాటు జనరల్ నాలెడ్జి పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానాన్ని పెంచుకోవచ్చని, అందుకోసం అందరూ గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని తెలిపారు.
మండల విద్యాశాఖ అధికారి శ్రీ డి. ప్రసాద్ ఖాళీ సమయంలో గ్రంథాలయానికి వెళ్లడం అలవాటు చేసుకోవాలని, కనీసం ఆదివారం రోజున గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య అతిథుల ద్వారా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వి వి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వై .సత్యవతి, రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ వేజెండ్ల శ్రీనివాసరావు, మానవతా ట్రెజరర్ శ్రీ వంకాయలపాటి హరిబాబు, వివిధ స్కూల్స్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పెద్దలు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం బాపట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీమతి యం .హాసిని గ్రంథాలయంలోని వివిధ విభాగాలను, పుస్తకాలను, ఇంటర్నెట్ సౌకర్యాలను పరిశీలించి, గ్రంథాలయ సేవలను అభినందించారు. గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గ్రంథాలయ అధికారికి హామీ ఇచ్చారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు.







