రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆయనపై అభ్యంతరకర పుస్తకాన్ని ముద్రించాలని చూస్తున్న హమారా ప్రసాద్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు శాఖను ఆదేశించాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి (డీబీహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఎస్సీ కమిషన్‌ను కోరారు.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్, కమిషన్ సభ్యులు మేకల బిక్షంను మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో డీబీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని, పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలను వారికి సమర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ, సుమారు 110 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించేలా ఎన్నికల సంఘానికి ఎస్సీ కమిషన్ ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులు, నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా నరసరావుపేటలో అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను అందించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, అదేవిధంగా అంబేద్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న హమారా ప్రసాద్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్సీ కమిషన్‌ను కోరారు.











