వేటపాలెం, 12 November
దేశాయిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మార్పు నలిని పేరును చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రకటించారు.
చీరాల నియోజకవర్గం మండలం దేశాయిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మార్పు నలిని పేరును చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అధికారికంగా ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానమైన దేశాయిపేట గ్రామ పంచాయతీకి, గ్రామ ప్రజల అభీష్టం మరియు విజ్ఞప్తి మేరకు నల్లమల దావీదు సతీమణి అయిన మార్పు నలినిని అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాల నేపథ్యంలో, బుధవారం దేశాయిపేటలోని చల్లా రామయ్య కళ్యాణ మండపంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాలకొండయ్యను దేశాయిపేట గ్రామస్థులు కలిసి, మార్పు నలిని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఆమెకు గ్రామ ప్రజలంతా మద్దతుగా నిలుస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు.
గ్రామ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే, ఆమె పేరును ప్రకటించి, రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి విజయానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలో తొలి సర్పంచ్ అభ్యర్థిగా మార్పు నలిని పేరు ప్రకటించడంతో, పంచాయతీ ఎన్నికల సందడి ముందుగానే ప్రారంభమైంది. ఇతర గ్రామాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి.






