చీరాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకుడు పంచుమర్తి సాయిబాబు తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. పేరాల వీరరాఘవ స్వామి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సాయిబాబుకి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ పాలన పట్ల ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అందరినీ భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు.
పార్టీలో చేరిన పంచుమర్తి సాయిబాబు మాట్లాడుతూ, టీడీపీ బలోపేతానికి తన అనుచరులతో కలిసి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు దోగుపర్తి సురేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ మించాల సాంబశివరావు, మాజీ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్యతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











