రాష్ట్రవ్యాప్తంగా హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. స్మరణ్ రాజ్ తెలిపారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే కళాజాతా కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎల్. రాధిక మాట్లాడుతూ, యువతకు హెచ్ఐవీపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో భాగంగా, అధిక ప్రమాదం ఉన్న కేసులను గుర్తించి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హెచ్ఐవీ నిర్ధారణ అయిన వారికి వెంటనే ఏఆర్టీ కేంద్రాల ద్వారా మందులు అందిస్తున్నట్లు వివరించారు.
పట్టణాలు, గ్రామాల్లో కళాజాతా బృందాల ద్వారా హెచ్ఐవీ ఎలా సంక్రమిస్తుంది, వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపరాదని సూచించారు. హెచ్ఐవీ, ఎస్టీఐ, క్షయ వ్యాధులపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ నెల 29న విజయవాడలో రాష్ట్రస్థాయి 5కే మారథాన్ రన్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ సుకుమార్, ఉమ్మడి జిల్లాల దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ వేంపల్లి భాస్కర్, జిల్లా సూపర్వైజర్లు ప్రసాద్, ఆనంద్, ఎన్జీవో ప్రాజెక్ట్ మేనేజర్లు పురుషోత్తం, శ్రీనివాసులు, అలావలి, ఓబులేసు, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
ఏఆర్టీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
అనంతరం ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. స్మరణ్ రాజ్ మదనపల్లె జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్‌తో పాటు సిబ్బందిని వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, అందుతున్న సేవలపై సమీక్షించారు.

