చీరాల: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ, చీరాల ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. జర్నలిస్టులకు ప్రత్యేక భద్రతా చట్టం తీసుకురావడంతో పాటు, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను పునరుద్ధరించాలని, నూతన వేతన బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు.
వెటరన్ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యంతో పాటు, గతంలో ఉన్న రైల్వే 50 శాతం ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే చీరాల యూనియన్ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.












