అధికారులకు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 14
తుపాను నష్టం అంచనాల నివేదికను ఆదివారం సాయంత్రంలోగా అందించాలని, ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అర్నబ్, మురసు తుపానుల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై చేపట్టిన సర్వేను పూర్తి చేసి, సమగ్ర అంచనాల నివేదికను ఆదివారం సాయంత్రంలోగా అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. తుపాను నష్టం అంచనాలు, శాసనమండలి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో నంబర్లు 1, 5 ప్రకారం తుపాను నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదికలు రూపొందించాలని సూచించారు. నష్టపోయిన వారందరికీ ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వుల మేరకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జలవనరుల శాఖకు సంబంధించి 289 ప్రాంతాల్లో జరిగిన నష్టంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టిన అధికారులు వాటి వివరాలను అందించాలని సూచించారు. ఆయా పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
వర్షపు నీటిని తొలగించేందుకు యంత్రాలను వినియోగించి ఖర్చు చేసినట్లయితే, నిబంధనల ప్రకారం ఆ ఖర్చులను కూడా అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. నష్టం అంచనాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా నివేదికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితా తయారీ
ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి జాప్యం జరగరాదని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నమోదైన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. పర్చూరు నియోజకవర్గంలో ఫారం-6 కింద 584 దరఖాస్తులు పెండింగ్లో ఉండటంపై కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. ఫారం-6, 7, 8 కింద వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు.
శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఎలక్టోరల్ పరిశీలకులను నియమించిందని, వారు వారంలో మూడు పర్యాయాలు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ తెలిపారు. ముందుగా ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, అనంతరం తుది జాబితా రూపొందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల అభివృద్ధి
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలు జరిగిన ప్రాంతంలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నందున భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం అభివృద్ధి పనుల కోసం రూ.2,500 చొప్పున నిధులు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, పోలింగ్ కేంద్రాలను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. గోడలకు నాలుగడుగుల ఎత్తు వరకు తెల్లరంగు పెయింటింగ్ వేయించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.






