బాపట్ల, 2026-11-15
సమాజంలో వేళ్లూనుకుంటున్న మూఢనమ్మకాలను పారద్రోలి, ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా జనవిజ్ఞాన వేదిక మూడవ ప్లీనం ఆదివారం చీరాల పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగింది.
సమాజంలో వేళ్లూనుకుంటున్న మూఢనమ్మకాలను పారద్రోలుతూ, ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించి, శాస్త్రీయ దృక్పథంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు పిలుపునిచ్చారు. ఆదివారం చీరాల పట్టణంలోని స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో బాపట్ల జిల్లా జనవిజ్ఞాన వేదిక మూడవ ప్లీనం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జనవిజ్ఞాన వేదిక జెండాను ఆవిష్కరించి ప్లీనాన్ని ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ నేటి సమాజంలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వాటిని నిర్మూలించేందుకు ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలోని వివిధ రంగాలు కలుషితమవుతున్నాయని, ప్రైవేటీకరణ కూడా పెరిగిపోతోందని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక పరిణామాలపై జనవిజ్ఞాన వేదిక మరింత విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని సూచించారు.
ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే చిన్నారుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం పాఠశాల స్థాయిలో చెకుముకి పోటీలు నిర్వహించాలని, విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చడంతో పాటు మూఢనమ్మకాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ప్లీనంలో జనవిజ్ఞాన వేదిక ఆవిర్భావ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు, సమకాలీన సామాజిక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. భవిష్యత్తులో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా కుర్రా రామారావును ఎంపిక చేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది.
ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి బి. రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.కె. హుస్సేన్, జిల్లా అధ్యక్షులు బి. హరిబాబు, పిచ్చయ్య, మాల్యాద్రి, కే. శీను, సూరిబాబు, యూటీఎఫ్ నాయకులు సి.హెచ్. బాపయ్య, మురళి, వై. భాస్కరరావు, ముజీర్ కరీముల్లా, అంకిరెడ్డి శ్రీను, ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాసరావుతో పాటు జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు, సభ్యులు పలువురు పాల్గొన్నారు.





