బాపట్ల, 15 November
బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా స్థానికేతర వ్యక్తిని ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.యస్. మాధవ్‌కు రాజీనామా లేఖ పంపించారు. ఈ నిర్ణయం స్థానిక నాయకులను, ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉందని ఆయన పేర్కొన్నారు.
బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం భారతీయ జనతా పార్టీలో రాజకీయ చర్చకు దారితీసింది. బాపట్ల పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థిగా స్థానికేతర వ్యక్తిని ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.యస్. మాధవ్‌కు రాజీనామా లేఖ పంపించారు.
తన రాజీనామా లేఖలో అన్నం సతీష్ ప్రభాకర్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించారు. 2019లో ఎమ్మెల్సీ పదవీకాలం ఇంకా రెండేళ్లు మిగిలి ఉండగానే రాజకీయ నైతిక విలువలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు.
గత ఏడేళ్లుగా పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్నానని, ఏ సందర్భంలోనూ పార్టీ పదవులు ఆశించలేదని, ఎలాంటి పైరవీలు చేయకుండా లాభాపేక్ష లేకుండా పార్టీ అభివృద్ధికి తన వంతు సహకారం అందించానని లేఖలో వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో రాష్ట్ర నాయకత్వం స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా స్థానికేతర వ్యక్తిని ప్రతిపాదించడం పట్ల తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం స్థానిక నాయకులను అవమానపరచడమే కాకుండా బాపట్ల పట్టణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉందని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు. స్థానికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని రాష్ట్ర అధ్యక్షుడిని కోరారు.
ఇప్పటికే బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రాజీనామా నిర్ణయం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.





