చీరాల, 2026-11-16
చీరాల మండలం గవినివారిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున గవిని నాగేశ్వరరావును ఖరారు చేస్తూ చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే ఆమోదం తెలపడంతో గ్రామంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా గవిని నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలు, సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారుల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ గవినివారిపాలెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. తనపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనకు మద్దతుగా నిలిచి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని గవిని నాగేశ్వరరావు వెల్లడించారు.






