మంగళగిరి గ్రామీణం, 2026-11-25
తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామంలో బుధవారం నాడు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామంలో బుధవారం నాడు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో బాలలపై జరుగుతున్న దోపిడీ, హింస, వేధింపులను ప్రస్తావించిన అత్తోట పోతురాజు, పిల్లలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోలేరని, పెద్దల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు అందిస్తున్న సేవల గురించి పిల్లలకు వివరించారు. కేవలం అధికారులు, నిపుణులే కాకుండా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతోనే పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించగలమని ఆయన అన్నారు. వేధింపులు, హింస, దోపిడీ వంటివి శారీరక, మానసిక, ఆర్థిక లేదా పని ప్రదేశాల్లో ఏ రూపంలో ఉంటాయో పిల్లలకు అర్థమయ్యేలా చేయడం, ఆపద సమయంలో ఎవరి సహాయం తీసుకోవాలో, ఎలా సురక్షితంగా ఉండాలో తెలియజేయడం ఈ చర్చల ముఖ్య ఉద్దేశ్యం. కేవలం పైస్థాయిలో నియమాలు రూపొందించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లల అనుభవాలను, అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని, వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్యగా కాకుండా, సమాజం మొత్తం కలిసి పరిష్కరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు.
18 సంవత్సరాల లోపు పిల్లల శారీరక, మానసిక లేదా లైంగిక శ్రేయస్సుకు హాని కలిగించే ఏ విషయంలోనైనా నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సామాజిక సమస్యలలో బాలలపై జరిగే వేధింపులు ఒకటి అని, అటువంటి పరిస్థితుల్లో పెద్దలు తక్షణమే స్పందించడం చాలా ముఖ్యమని అన్నారు. ఆపదలో ఉన్న పిల్లల కోసం చైల్డ్‌లైన్ 1098 టోల్-ఫ్రీ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా ఈ నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం 112 లేదా 100 నంబర్లకు కాల్ చేయవచ్చని సూచించారు. పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి, నిందితులకు కఠిన శిక్షలు విధించడానికి పోక్సో చట్టం 2012 రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్ర బోస్, బాలల పార్లమెంట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







