బాపట్ల, 2026-11-29
బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సోమవారం ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26న బాపట్ల మున్సిపాలిటీకి నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం స్థానిక బాపట్ల ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లకు కల్పించాల్సిన వసతులు, తాగునీరు, ఇతర సౌకర్యాలను ఆయన పరిశీలించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ ఏ. హరికుమార్, డీఆర్డీఏ పీడీ, రిటర్నింగ్ అధికారి బి. సింగయ్య, మున్సిపల్ కమిషనర్ ఎం. హాసిని, డీఈ కృష్ణారెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ అరుణ, తహశీల్దార్ షేక్ సలీమా, మండల సర్వేయర్ లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.







