బాపట్ల, 2026-11-28
రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు బాపట్ల జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. చీరాల, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో ఈ నెల 29న జరగనున్న ఎన్నికల విధుల కోసం 1,400 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించినట్లు ఆయన వెల్లడించారు. శనివారం భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ యార్డులో ఎన్నికల విధులకు హాజరైన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే నిర్వహించిన మున్సిపల్, ఎంపీటీసీ, మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. అదే స్ఫూర్తితో రెండవ దశ ఎన్నికలను కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు. వేమూరు, చీరాల నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 113 గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల కోసం 78కు పైగా రూట్ మొబైల్స్, 65 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 40 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలతో పాటు ప్రత్యేక రిజర్వ్ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రత్యేకంగా 25 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 38 రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశామని, ముగ్గురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 34 మంది ఎస్ఐలతో పాటు 900 మందికి పైగా పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించినట్లు వివరించారు.
పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని, 100 మీటర్ల పరిధిలో ఎవరూ గుమిగూడకుండా చూడాలని, ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసేందుకు క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల విధుల్లో సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తప్పనిసరిగా సమర్థ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని ఆదేశించారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు యాప్‌లోని బటన్ నొక్కితే సమీప పోలీస్ బలగాలకు, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరుతుందని, తద్వారా తక్షణమే స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించవచ్చని వివరించారు. ఎన్నికల సమయంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో లేదా అనంతరం ఘర్షణలు, అల్లర్లకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె, బాపట్ల, ఏఆర్ డీఎస్పీలు షేక్ అబ్దుల్ అజీజ్, సీహెచ్ చంద్ర మౌళి, పి. కృష్ణంరాజు, వేమూరు, చుండూరు సీఐలతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







