చీరాల, 2026-11-26
గుంటూరు జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు, బాపట్ల మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. బాపట్ల మున్సిపాలిటీలోని 44 వార్డులకు, పర్చూరు నియోజకవర్గంలోని 62 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడా చిన్నపాటి ఘటనలున్నా, పోలీస్ యంత్రాంగం సత్వర స్పందనతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి.
గుంటూరు జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు, బాపట్ల మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. గురువారం బాపట్ల మున్సిపాలిటీలోని 44 వార్డులకు సంబంధించి 88 పోలింగ్ స్టేషన్లలో, పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో ఉన్న 62 పంచాయతీలకు సంబంధించి 657 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరిగాయని తెలిపారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తలెత్తినప్పటికీ, పోలీస్ యంత్రాంగం వేగంగా స్పందించి సంఘటనా స్థలాలకు చేరుకుని శాంతిభద్రతలను పరిరక్షించాయన్నారు.
పోలీస్ యంత్రాంగం వేగంగా స్పందించేందుకు సమర్థ్ మొబైల్ యాప్ ఎంతగానో దోహదపడిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా గూగుల్ మ్యాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, రియల్ టైమ్ లొకేషన్ ఆధారంగా పర్యవేక్షించడం జరిగిందన్నారు. సమస్య తలెత్తిన ప్రదేశానికి సమీపంలోని పోలీస్ బృందాలు వేగంగా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బాపట్ల మున్సిపల్, మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించగలిగారు.
పోలింగ్ అనంతరం చర్యలు
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలలో భాగంగా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ర్యాలీలకు అనుమతి లేదు
ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో పాటు, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కూడా అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీస్ శాఖకు సహకరించాలని తెలిపారు.





