సామాజిక న్యాయ దినోత్సవం పురస్కరించుకొని కనిగిరి పట్టణంలో న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్తంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించాయి. ఈ సదస్సులో సామాజిక న్యాయం ద్వారానే దేశ ప్రగతి సాధ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జడ్జి బి. రూపశ్రీ నేతృత్వంలో పి వి ఆర్ మున్సిపాలిటీ పార్క్ నందు ఈ సదస్సు జరిగింది. సామాజిక న్యాయంతోనే దేశ ప్రగతి సాధ్యమని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, అవకాశాలను ప్రతి పౌరుడు అనుభవించేలా చేయడమే సామాజిక న్యాయ దినోత్సవం ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
సామాజిక న్యాయం అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు. ప్రతి పౌరుడు తమ హక్కులను తెలుసుకోవాలని, వాటిని పొందడంలో న్యాయ సేవాధికార సంస్థ సహాయపడుతుందని తెలిపారు.
న్యాయవాది పాశం పిచ్చయ్య మాట్లాడుతూ, సామాజిక న్యాయం అంటే కుల, మత, లింగ, ఆర్థిక, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, అవకాశాలు, గౌరవం కల్పించడమేనని వివరించారు. పౌరులకు వారి హక్కులపై అవగాహన కల్పించారు. సామాజిక న్యాయం కోసం న్యాయ సేవాధికార సంస్థ చేస్తున్న సేవలను ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలని, దాని పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


