బాపట్ల, July 14
కారంచేడు మారణకాండ అనంతరం బాధితులకు అండగా నిలిచి, దళిత ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడు కోటి జేమ్స్ సేవలను దళిత నాయకులు ఘనంగా స్మరించుకున్నారు. చీరాల శాంతినగర్‌లోని బ్రదరన్ చర్చి ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన స్మారక కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కారంచేడు మారణకాండ అనంతరం బాధితులకు అండగా నిలిచి, దళిత ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడు కోటి జేమ్స్ సేవలను దళిత నాయకులు ఘనంగా స్మరించుకున్నారు. చీరాల శాంతినగర్‌లోని బ్రదరన్ చర్చి ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన స్మారక కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర మాట్లాడుతూ, 1985 జూలై 17న జరిగిన కారంచేడు మారణకాండ అనంతరం బాధితులకు అండగా నిలిచి దళిత ఉద్యమాన్ని నిర్మించడంలో కోటి జేమ్స్, కత్తి పద్మారావుతో కలిసి విశేష కృషి చేశారని తెలిపారు. చీరాలలోని 18 మాలపేటలను ఏకం చేసి "పూటకో పేట" నినాదంతో కారంచేడు బాధితులకు భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
కారంచేడు బాధితుల శిబిరానికి రక్షణ కల్పించడం, విజయనగర్ కాలనీ ఏర్పాటు, బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కారంచేడు కేసులో న్యాయపోరాటానికి వ్యూహాత్మకంగా నాయకత్వం వహించడం వంటి అంశాల్లో కోటి జేమ్స్ విశేష సేవలు అందించారని అన్నారు. బాధితుల కమిటీ తరపున తేళ్ల జడ్సన్, దుడ్డు భాస్కరరావు తదితరులతో కలిసి ఆయన సుదీర్ఘకాలం ఉద్యమాన్ని ముందుకు నడిపించారని పేర్కొన్నారు.
దళిత ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు వివిధ రాజకీయ పార్టీలు చేసిన ప్రయత్నాలను కత్తి పద్మారావుతో కలిసి సమర్థంగా తిప్పికొట్టారని, ఉద్యమ లక్ష్యాలను దారి మళ్లకుండా కాపాడటంలో కోటి జేమ్స్ అంకితభావంతో పనిచేశారని నీలం నాగేంద్ర కొనియాడారు. అనంతరం పాస్టర్‌గా సేవలందించినప్పటికీ, ఆయనలోని పోరాటస్ఫూర్తి, ఉద్యమ దృక్పథం, సామాజిక నిబద్ధత నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, దళిత మహిళా విభాగం అధ్యక్షురాలు బి.ఎం. లీలాకుమారి, దళిత విప్లవ సేన కన్వీనర్ క్రాంతి, దుడ్డు భాస్కరరావు, లక్ష్మీనరసయ్య, మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, హైకోర్టు న్యాయవాది సురేష్, కంతేరు సాంబయ్య, దళిత మహాసభ అధ్యక్షుడు జూలియన్, దారా అంజయ్య, కాకుమాను రవి తదితరులు పాల్గొని కోటి జేమ్స్‌కు ఘనంగా నివాళులర్పించారు.











