బాపట్ల, 14 జూలై 2026
కారంచేడు మారణకాండ బాధితులకు పునరావాసం, పరిరక్షణ కల్పించి, దళిత ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన కోటి జేమ్స్ కు దళిత నాయకులు నివాళులర్పించారు. చీరాల శాంతినగర్ బ్రదరన్ చర్చి వద్ద మంగళవారం జరిగిన అంత్యక్రియల స్మారక కార్యక్రమంలో ఆయన సేవలను కొనియాడారు.
కారంచేడు మారణకాండ నుండి దళిత ఉద్యమాన్ని నిర్మించడంలో బాధితులకు పునరావాసం మరియు పరిరక్షణ కల్పించిన నాయకుడు కోటి జేమ్స్ అని, కారంచేడు ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసిన పలువురు దళిత నాయకులు నివాళులర్పించారు. చీరాల శాంతినగర్ బ్రదరన్ చర్చి వద్ద అంత్యక్రియల స్మారక కార్యక్రమం మంగళవారం జరిగింది.
ఈ సందర్భంగా దళిత నాయకులు అందరి తరపున దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర మాట్లాడుతూ, 1985 జూలై 17న కారంచేడు మాదిగలపై అగ్రకుల కమ్మ దుండగులు జరిపిన మారణకాండకు చెలించి దళిత ఉద్యమం నిర్వహించిన కత్తి పద్మారావు కు కోటి జేమ్స్ కు గురుదర్యులు అని అన్నారు. కారంచేడు మాదిగ నరమేధం జరిగి చీరాల వచ్చిన బాధితులకు అండగా చీరాలలోని 18 మాల పేటలను ఏకం చేసిన వారిలో కోటి జేమ్స్ ముఖ్యులన్నారు. కత్తి పద్మారావు తో కలిసి మాలపల్లిలన్నీ తిరిగి పూటకో పేట నినాదంతో కారంచేడు బాధితులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భోజనాలు ఏర్పాటు చేశారన్నారు. అలాగే అగ్రకుల అరాచక శక్తులు కారంచేడు శిబిరాన్ని చల్లా చదరం కాకుండా రక్షణ కావచంలా కోటి జేమ్స్ నిలిచారన్నారు.
విజయనగర కాలనీ ఏర్పాటు, బాధితులకు ఉద్యోగాలు, కారంచేడు కేసు కోర్టులో న్యాయపోరాటం వంటి విషయాల్లో కారంచేడు బాధితుల కమిటీ తరపున తేళ్ల జడ్సన్, దుడ్డు భాస్కరరావు కుల పెద్దలతో కలిసి సుదీర్ఘ పోరాటం కొనసాగించడంలో కోటి జేమ్స్ వ్యూహాలు అభినందనీయమన్నారు. దళిత ఉద్యమంపై ఆనాటి పీపుల్స్ వారు ఉద్యమం సిద్ధాంతపరమైన దాడిని కూడా కోటి జేమ్స్ తన ఎత్తు గడలతో చిత్తు చేశారన్నారు. అలాగే కారంచేడు ఉద్యమాన్ని హైజాక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ, విచ్ఛిన్నం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా, కత్తి పద్మారావు తో కలిసి అగ్రకుల రాజకీయ పార్టీల దళారులను కారంచేడు ఉద్యమం వైపు రాకుండా కంచెలా నిలబడిన కార్యదీక్షపరుడు కోటి జేమ్స్ అన్నారు.
కోటి జేమ్స్ వృద్ధాప్య దశలో పాస్టర్ గా మారినప్పటికీ, ఉద్యమ కాలంలో ఆయన పోరాట పటిమ, వ్యూహాలు అభినందనీయమని, కోటి జేమ్స్ కత్తి పద్మారావు అడుగుజాడల్లోనే చీరాలకే పరిమితమయ్యారని దళిత నేత నీలం నాగేంద్రరావు దివంగత కోటి జేమ్స్ కు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, దళిత మహిళా అధ్యక్షురాలు బి.ఎం. లీలా కుమారి, దళిత విప్లవ సేన కన్వీనర్ క్రాంతి, దుడ్డు భాస్కరరావు, లక్ష్మీ నరసయ్య, మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకటరావు, హైకోర్టు న్యాయవాది సురేష్, కంతేరు సాంబయ్య, దళిత మహాసభ అధ్యక్షులు జూలియన్, దారా అంజయ్య, కాకుమాను రవి తదితరులు పాల్గొన్నారు.












