పశ్చిమ జిల్లా పెనుగొండలో డంపింగ్‌యార్డు నిర్వహణతో నక్కల డ్రెయిన్ పూడుకుపోయి సుమారు వెయ్యి ఎకరాల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోరుతూ సోమవారం 300 మంది రైతులు రాస్తారోకో నిర్వహించారు.
పశ్చిమ జిల్లాలోని పెనుగొండలో రైతులు తమ పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని నిరసనకు దిగారు. డంపింగ్‌యార్డు నిర్వహణతో నక్కల డ్రెయిన్ పూడుకుపోవడంతో సుమారు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం సుమారు 300 మంది రైతులు పెనుగొండ ప్యాలెస్ రోడ్డు సెంటర్లో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులో వేయడం వల్ల నక్కల డ్రెయిన్ క్రమంగా పూడుకుపోయి చిన్న కాలువగా మారిపోయిందని రైతులు ఆరోపించారు. దీంతో కోడవల్లి, ఖండ్రిక అగ్రహారం, పేకేరు, అయితంపూడి, పిట్టల వేమవరం గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
డంపింగ్‌యార్డును వెంటనే అక్కడి నుంచి తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. డంపింగ్‌యార్డు తరలింపు, డ్రెయిన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తహసీల్దార్ రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు.





