మార్కాపురం, 2026-11-25
అణగారిన వర్గాల ఓట్లను సేకరించి, వారిని వంచించడమే తమ నైజమని టిడిపి ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంటుందని వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ విమర్శించారు. మైనార్టీలను నిత్యం మోసం చేస్తూ వస్తున్న పార్టీ టిడిపి అని ఆయన ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన కూటమి ప్రభుత్వం, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ మైనార్టీలకు తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు.
అణగారిన వర్గాల ఓట్లను సేకరించి, వారిని వంచించడమే తమ నైజమని టిడిపి ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంటుందని వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ విమర్శించారు. మైనార్టీలను నిత్యం మోసం చేస్తూ వస్తున్న పార్టీ టిడిపి అని ఆయన ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన కూటమి ప్రభుత్వం, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ మైనార్టీలకు తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు. మార్కాపురం పట్టణ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవికి ముస్లింలను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోందని, అయితే దానిని తుంగలో తొక్కి ముస్లింలను తాజాగా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. మార్కాపురం పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ముస్లింలకు అవకాశం ఇవ్వకుండా, ఇతరులకు అవకాశం కల్పించడం టిడిపి మోసపూరిత విధానానికి నిదర్శనమని అన్నారు. తమ హయాంలో షాదీఖాన నిర్మాణ పనులు చేపట్టాలని, నాడు కెమెరాలతో షాదీఖానా చుట్టూ ప్రదక్షిణలు చేసిన జనసేన నాయకులు ఇప్పుడు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలిస్తున్నా, షాదీఖానా నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని జనసేన, టిడిపి నేతలను ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిసారి ముస్లిం మైనార్టీలను మోసం చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ముస్లింలకు న్యాయం చేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ముస్లింలకు అనేక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించడమే కాకుండా, మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ పెద్ద ఎత్తున చోటు కల్పించారని ఆయన వెల్లడించారు. ఒకసారి వైసీపీ పాలనను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా ముస్లింలు టిడిపి ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని గుర్తించి, మరోసారి వైసీపీని బలంగా బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీతోనే రాష్ట్రంలోని ముస్లింల భవిష్యత్తు ముడిపడి ఉందని ఆయన తేల్చి చెప్పారు. ఏపీలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, అప్పుడే ముస్లింలకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







