లక్ష్యం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 21
జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసింది.
జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులు గ్రామాల్లో రాత్రి బస చేసి స్థానిక ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. గ్రామసభలు నిర్వహించి, స్థానిక సమస్యలు, ఎన్నికల నేపథ్యంలో తలెత్తే అవకాశం ఉన్న సున్నితమైన అంశాలపై ఆరా తీశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలను వివరించి, ప్రజల్లో భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ, జిల్లాలో మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పర్చూరు, చీరాల, వేమూరు నియోజకవర్గాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలకు, బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మూడో దశ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లో శనివారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంపొందించేందుకు, సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ బలగాలతో కవాతులు నిర్వహిస్తున్నామని, గ్రామాలను సందర్శించి ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు, పల్లె నిద్ర కార్యక్రమంతో పాటు పలు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రజల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడమే పోలీస్ శాఖ లక్ష్యమని స్పష్టం చేశారు.







