ఆదోని, 2026-11-24
రాయలసీమలోని ఆదోని ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, నదులు, కాల్వలు ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ పేర్కొన్నారు. పత్తికొండ, ఆస్పరి ప్రాంతాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఊరి పక్కనే నదులు, మంచి నీటి కాల్వలు ప్రవహిస్తున్నా, తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న దుస్థితి రాయలసీమలో, ముఖ్యంగా ఆదోని ప్రాంతంలో నెలకొంది. ముఖ్యంగా తుంగభద్ర నదితో పాటు చిన్న చిన్న నదులు, కాల్వలు ఉన్నా కూడా ఆదోని ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలు తాగునీటి సమస్యతో అవస్థలు పడుతుండటం బాధాకరం. ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్, పత్తికొండ పక్కనే ప్రవహిస్తున్న హంద్రీ నీవా కాల్వను పరిశీలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఆదోని ప్రాంతంలోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలందరికీ తాగునీటి సమస్యను తీర్చాలని ఆదోని జిల్లా సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పత్తికొండ పట్టణం పక్కనే ప్రవహిస్తున్న హంద్రీ నీవా ప్రాజెక్టు కాల్వ నీటిని, మంచి నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న పత్తికొండ, ఆస్పరి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాడుకునే అవకాశం లేకపోవడం బాధాకరం.
ప్రభుత్వం చట్టం చేసి అయినా హంద్రీ నీవా నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేయాలని కోరుతున్నాము. అదే విధంగా, ఆదోని ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు పత్తికొండ మరియు ఆస్పరి గ్రామాల సమీపంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించి, ఇక్కడి ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేనియెడల ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నాము.




