చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని 41, 42, 43, 44వ వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్థానిక చర్చిలో ప్రార్థనలు నిర్వహించి, ప్రభువు ఆశీస్సులు పొందిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ, చీరాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, రాజకీయ రగడలకు తావులేని ప్రశాంతమైన, సుందరమైన పట్టణంగా రూపుదిద్దుకోవాలంటే కూటమి అభ్యర్థుల విజయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య నాయకత్వంలో చీరాల మున్సిపాలిటీలో చైర్మన్ పీఠంతో పాటు మెజారిటీ కౌన్సిలర్ స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించడంతో ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి హనీ స్పందన, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు, మిత్రపక్షాల నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










