ప్రొద్దుటూరు, 1 July
ప్రొద్దుటూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డిల మధ్య ఉన్న బలమైన బంధం, రాజకీయ వ్యూహాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ప్రొద్దుటూరు రాజకీయ యవనికపై వరదరాజుల రెడ్డి ఒక శక్తిగా నిలుస్తున్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం, చెక్కుచెదరని ప్రజాదరణతో నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన ఆయన నేటి రాజకీయాల్లో ఒక ధ్రువతార. అధికారం అంటే ఆస్తులు పెంచుకోవడం కాదని, ప్రజా సేవయే పరమార్థమని నిరూపించిన నాయకుడు ఆయన. అటువంటి అపర చాణక్యుడి ముందు ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి ఎంపిక అనే కీలకమైన పొలిటికల్ పజిల్ వచ్చి పడింది.
ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డిల మధ్య ఉన్న బంధం కేవలం రక్తసంబంధం కాదు, అది ఒక అభేద్యమైన రాజకీయ కవచం. అన్న కష్టం వస్తే తమ్ముడు, తమ్ముడికి ఆపద వస్తే అన్న స్పందించే వీరి అనుబంధం చూసి, ప్రొద్దుటూరు ప్రజలు వీరిని సొంత కన్నబిడ్డలుగా భావిస్తారు. రాజకీయంగా ఎదిగినా, ఆత్మీయతను ఏనాడూ పక్కన పెట్టని వీరిద్దరిది ఒక అరుదైన కలయిక.
ప్రస్తుతం మున్సిపల్ పీఠంపై రాఘవరెడ్డి కన్నేశారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ప్రొద్దుటూరును తనదైన శైలిలో అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పం ఆయనలో బలంగా కనిపిస్తోంది. మరోవైపు, రాఘవరెడ్డి గెలుపు కోసం ఆయన అనుచరులు, అభిమానులు పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు. 'మా పెద్దాయన వరదరాజుల రెడ్డి ఆశీస్సులతో, రాఘవరెడ్డిని మున్సిపల్ పీఠంపై కూర్చోబెడతాం' అని వారు గట్టిగా చెబుతున్నారు.
ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. పెద్దాయన వద్ద ఎన్నో ఏళ్లుగా నమ్మకస్తులైన అనుచరులు, పార్టీ శ్రేయోభిలాషులు చైర్మన్ పీఠం కోసం వేచి చూస్తున్నారు. వారిని కాదని సోదరుడికి అవకాశం ఇస్తారా? లేదా, అందరినీ కలుపుకుపోయే క్రమంలో మరో వ్యూహాన్ని అమలు చేస్తారా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. ఏది ఏమైనా ప్రొద్దుటూరు అభివృద్ధికి అడుగులు పడతాయి.
ప్రొద్దుటూరు రాజకీయాల్లో వరదరాజుల రెడ్డి తీసుకునే నిర్ణయం ఏదయినా, అది ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఉంటుంది. ఎవరికి పీఠం దక్కినా, దాని వెనుక ఉన్నది మాత్రం నంద్యాల వ్యూహమే. పెద్దాయన అడుగుజాడల్లో నడుస్తూ, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించే అదృష్టవంతుడు ఎవరో తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అన్నదమ్ముల బంధం.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలోనే వరదరాజుల రెడ్డి రాజకీయ చతురత దాగి ఉంది.












