రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేరడానికి నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేరడానికి నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని అన్నారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు ఈ చారిత్రక సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మా ప్రజా పాలనకు పునాదులు. ఈ తేదీ మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. ఈ చారిత్రక నేపథ్యం, ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి. యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి.
తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ. అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించింది.
ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం వారి సమస్యలకు పరిష్కారం చూపడం. వారి హక్కులను కాపాడడం. ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడడం. అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నాం.
తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతోంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కు చేరింది. ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికం. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే మా లక్ష్యం.











