భారత నౌకాదళ సామర్థ్యాన్ని పెంచే కీలక పరిణామం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో భారత నౌకాదళం కోసం నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-1) సూర్యను ప్రారంభించారు. దేశీయంగా హిందుస్తాన్ షిప్‌యార్డ్ ఈ నౌకను నిర్మించింది.
ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-5)కు కీల్ వేశారు. అలాగే షిప్‌యార్డ్‌లో ఆధునీకరించిన స్లిప్‌వే-4, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్‌ను ప్రారంభించారు. ఈ మౌలిక సదుపాయాల విస్తరణతో హిందుస్తాన్ షిప్‌యార్డ్ మరింత పెద్ద, సంక్లిష్టమైన నౌకలను నిర్మించి నీటిలోకి దించే సామర్థ్యాన్ని పెంచుకోనుంది.
ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల సామర్థ్యం
ఎఫ్ఎస్ఎస్-1తో పాటు నిర్మిస్తున్న మొత్తం ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు సుమారు 43,500 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటాయి. సముద్రంలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించే నౌకాదళ యుద్ధనౌకలకు ఇంధనం, నీరు, ఇతర అవసరమైన సామగ్రిని సముద్రంలోనే అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి. దీంతో యుద్ధనౌకలు తరచూ తీరానికి తిరిగి రావాల్సిన అవసరం తగ్గి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకాదళం ఎక్కువ కాలం కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది.
సూర్యలో అధిక సామర్థ్యం కలిగిన సరుకు, ద్రవ పదార్థాల నిల్వ సదుపాయాలతో పాటు నౌకలోనే ప్రాథమిక మరమ్మతులు చేపట్టేందుకు వర్క్‌షాప్‌లు, బహుళ ప్రయోజన హెలికాప్టర్ల కోసం డెక్, స్వీయ రక్షణ వ్యవస్థలు ఉంటాయి.
విశాఖను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హిందుస్తాన్ షిప్‌యార్డ్‌తో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, స్టార్టప్‌లను అనుసంధానించడం ద్వారా పూర్తిస్థాయి నౌకా నిర్మాణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.
భారత్ నౌకా నిర్మాణ రంగం స్వయం సమృద్ధి నుంచి అంతర్జాతీయ పోటీతత్వం దిశగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. నాణ్యత, ఉత్పాదకత, సకాలంలో నిర్మాణం, దేశీయ సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య సిబ్బంది, సరఫరా వ్యవస్థ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అప్‌గ్రేడ్ చేసిన స్లిప్‌వే-4, 300 టన్నుల గోలియాత్ క్రేన్ సాయంతో హిందుస్తాన్ షిప్‌యార్డ్ 45,000 డెడ్‌వెయిట్ టన్నుల వరకు సామర్థ్యం ఉన్న నౌకలను నిర్మించి ప్రారంభించే స్థాయికి చేరుకోనుంది.
ఈ మూడు కార్యక్రమాలుసూర్య ప్రారంభం, ఎఫ్ఎస్ఎస్-5 కీల్ వేయడం, కొత్త మౌలిక సదుపాయాల ప్రారంభంభారతదేశ దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని, నౌకాదళ సముద్ర కార్యకలాపాల దీర్ఘకాలిక సామర్థ్యాన్ని పెంచే చర్యలుగా నిలిచాయి.












