జిల్లా రామాపురం బీచ్‌లో ఆంధ్రప్రదేశ్ అంతర్‌జిల్లాల బీచ్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీలు 9,10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌ఏ), జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పోటీలు జరగనున్నాయి. జిల్లాలో తొలిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తుండటం విశేషం.
యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. క్రీడల ద్వారా యువత అభివృద్ధికి బాటలు వేయాలనే లక్ష్యంతో పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అధికారుల సహకారం
ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు మాజీ ఎంపీ కొటగిరి శ్రీధర్, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సహకారంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత లభిస్తోంది. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు జి. వంశీకిరణ్, ఉపాధ్యక్షురాలు ఎం. ప్రభావతి, కోశాధికారి పి. హనుమంతరావు, సమ్మర్ ఫుట్‌బాల్ క్యాంప్ ఇన్చార్జి బి. ప్రేమయ్య అసోసియేషన్ సభ్యులు తదితరులు ఏర్పాట్లలో భాగస్వాములయ్యారు.
నిర్వహణ ఏర్పాట్లు
నూతలపాటి దేవదాసు, నల్లమల జోనల్ ఇన్చార్జి ఆధ్వర్యంలో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. చీరాల, వేటపాలెం, ప్రాంతాల క్రీడాకారులు, యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.










