భారత మహిళల క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్మృతి మంధాన తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. కెప్టెన్సీ బాధ్యతలు తన ఆటను ప్రభావితం చేయవని, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడుతూనే ఉంటానని తెలిపింది.
భారత జట్టుకు దాదాపు పదేళ్ల పాటు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం తనకు ఉందని, నాయకత్వ బాధ్యతలు కొత్తగా అనిపించడం లేదని పేర్కొంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో మంధాన భారత మహిళల జట్టు పగ్గాలు చేపట్టింది. ఆమె నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో తన ఆలోచనలను వెల్లడించింది. కెప్టెన్‌గా బాధ్యతలు పెరిగినా, బ్యాటర్‌గా తన సహజమైన దూకుడును కొనసాగిస్తానని స్పష్టం చేసింది.
15 ఏళ్ల వయసులో కోచ్ కీలక సూచన
తాను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రతి ఇన్నింగ్స్‌ను కెప్టెన్లా ఆడాలని తన కోచ్ సూచించేవారని మంధాన గుర్తుచేసుకుంది. బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఇన్నింగ్స్‌కు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పేవారని వివరించింది. ఆ సూత్రాన్ని ఇప్పటికీ పాటిస్తున్నానని తెలిపింది. తనకు అనుకూలమైన బంతి ఎదురైతే దానిని బలంగా ఆడేందుకు వెనుకాడబోనని, అయితే జట్టు పరిస్థితి, అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటానని మంధాన పేర్కొంది. కెప్టెన్సీ కోసం తన సహజమైన బ్యాటింగ్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది.
హర్మన్‌ప్రీత్, మిథాలీ రాజ్ నుంచి అనుభవం
భారత మహిళల క్రికెట్లో గతంలో కెప్టెన్లుగా వ్యవహరించిన మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వ శైలులను దగ్గరగా గమనించే అవకాశం తనకు లభించిందని మంధాన తెలిపింది. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్‌కు భారత జట్టును సుదీర్ఘకాలం నడిపించిన అనుభవం ఉందని, ఆమె సలహాలు, సహకారం తనకు ఎంతో విలువైనవని పేర్కొంది.
భారత క్రికెట్‌ను రాబోయే సంవత్సరాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలి, జట్టు పనితీరును ఎలా మెరుగుపరచాలి అనే అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపినట్లు వివరించింది. తదుపరి రెండు నుంచి మూడు సంవత్సరాల్లో జరగనున్న ప్రధాన టోర్నీలను దృష్టిలో ఉంచుకుని జట్టు వ్యూహాలను రూపొందించాల్సి ఉందని తెలిపింది.












