బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. జిల్లాలోని కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ సుమారు మూడు గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్డీఎంఏ) వెల్లడించింది.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా , విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని కోరారు. సముద్రంలో అలలు ఉధృతంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు.











