జంగారెడ్డిగూడెం, జూలై 15
జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన భారీ మంచినీటి పథకానికి బుధవారం చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నిధులతో రూ.101.16 కోట్లతో ఈ మెగా ప్రాజెక్టును చేపడుతున్నారు. ఎర్రకాలువ జలాశయం నుంచి నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సరఫరా చేయనున్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన భారీ మంచినీటి పథకానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు.
ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నిధులతో రూ.101.16 కోట్లతో ఈ మెగా ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇందులో రూ.85.38 కోట్లు పథకం నిర్మాణానికి, మిగిలిన రూ.15.78 కోట్లు 7 సంవత్సరాల పాటు నిర్వహణకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి కేటాయించారు.
కొంగువారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాలువ జలాశయం నుంచి నీటిని తీసుకుని, శుద్ధి చేసిన అనంతరం పట్టణంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సరఫరా చేయనున్నారు. ఈ పనులను హైదరాబాద్కు చెందిన సి-వెట్ కంపెనీ చేపట్టింది.
2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకానికి అప్పటి టిడిపి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఏఐఐబీ రూ.80.35 కోట్లు మంజూరు చేసింది. అయితే, ప్రభుత్వం మారడంతో వైసీపీ హయాంలో పనులు నిలిచిపోయాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని రీ-ఎస్టిమేట్ చేసి, నిధులు పెంచి, నేడు మళ్లీ పనులు ప్రారంభించారు.
ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న జంగారెడ్డిగూడెం ప్రజలు ఈ పథకం ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పథకం పూర్తయితే పట్టణానికి సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సి-వెట్ కంపెనీ ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, చిట్టిబోయిన రామలింగేశ్వర రావు, నంబూరి రామచంద్ర రాజు, దాసరి శ్యామసుందరి, శేషు, రావూరి కృష్ణ, బొబ్బర రాజు, పాల్ కుమార్, మండవ లక్ష్మణరావు, గుమ్మడి ప్రసాద్, వలవల తాతాజీ, బిజెపి నాయకులు తాడికొండ సుధాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, మారిశెట్టి సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, మహంకాళి రాంబాబు, మాలికల నాగేశ్వరరావు, వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ సంకర లక్ష్మణరావు, నీరుకొండ రాము మరియు ఇతర కూటమి సభ్యులు పాల్గొన్నారు.










