ఏలూరు, జూలై 16
రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా భీమడోలు పోలీసులు బుధవారం ప్రత్యేక అవగాహన డ్రైవ్ నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, డిఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు, భీమడోలు ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించకుండా, అవగాహన కల్పించి, 30 హెల్మెట్లను కొనుగోలు చేసి అందజేశారు.
రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా భీమడోలు పోలీసులు బుధవారం ప్రత్యేక అవగాహన డ్రైవ్ నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, డిఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు, భీమడోలు ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్ఐ షేక్ మదీనా బాషా తెలిపారు.
భీమడోలు మండలం, ఎన్.హెచ్ 216 రైల్వే గేట్ వద్ద ఎస్ఐ మదీనా బాషా, ఏఎస్ఐలు ప్రభాకర రావు, వెంకటేశ్వర రావు మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానాలు విధించే బదులు, వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా, అక్కడికక్కడే 30 హెల్మెట్లను కొనుగోలు చేయించి వాహనదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మదీనా బాషా మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికులు యువతే ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా థ్రిల్ కోసం బైకులను అతివేగంగా నడపడం, హెల్మెట్ ధరించకపోవడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే చిన్న దెబ్బ కూడా ప్రాణాంతకం కావచ్చని, హెల్మెట్ ధరించడం వల్ల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నిర్ణీత వేగ పరిమితిని పాటించాలని, ప్రయాణంలో మొబైల్ ఫోన్ వినియోగం అత్యంత ప్రమాదకరమని సూచించారు. "మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలి. మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తోంది" అని వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇకపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసుల నియంత్రణ చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఎస్ఐ మదీనా బాషా విజ్ఞప్తి చేశారు.












