కొయ్యలగూడెం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్ఓ) బాబు విలియమ్స్ హెచ్చరించారు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్ఓ) బాబు విలియమ్స్ హెచ్చరించారు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా కొయ్యలగూడెం మండలంలోని రాజవరం, కన్నాపురం గ్రామాల్లో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు, రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో బియ్యం నిల్వలకు సంబంధించి ఎలాంటి వ్యత్యాసాలు గుర్తించలేదని ఆయన అన్నారు.
రేషన్ కార్డుదారులు ప్రభుత్వం ఉచితంగా లేదా రాయితీపై అందించే బియ్యాన్ని ఇతరులకు విక్రయిస్తే, సంబంధిత కార్డులను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తోందని, కార్డుదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌పై ఫిర్యాదులు అందడంతో, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తామని ఆయన పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు పెరిగిన బియ్యం ధరల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు, జిల్లాలోని తొమ్మిది ధరణి కేంద్రాల ద్వారా బీపీటీ సన్నబియ్యాన్ని రాయితీ ధరలకు అందిస్తున్నట్లు డీఎస్ఓ తెలిపారు. త్వరలో ప్రతి మండల కేంద్రంలోనూ ధరణి కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని రాయితీ ధరలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బాబు విలియమ్స్ వెల్లడించారు.






