కోస్తా (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. మంగళవారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది, అనంతరం క్రమంగా ంధ్ర తీరం వైపు కదిలే అవకాశం ఉంది. గురువారం నాటికి ఇది తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవిస్తుందని భారత వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించాయి.
ఈ తీవ్ర తుఫాన్ ఈ నెల 19వ తేదీన, అంటే గురువారానికి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉన్నందున, జిల్లాల పరిధిలోని అన్ని స్థాయిల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం-వాయవ్య దిశగా కదులుతోంది. ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, చెన్నైకి 800 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,070 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి విపత్తు నిర్వహణ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. స్థానికంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. పరిస్థితి తీవ్రతను బట్టి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.
ఈ తుఫాన్ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో మంగళవారం వరకు తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తీవ్రమైన గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ తుఫాన్ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదు కానున్నాయి.
నెల రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనున్న మూడో తుఫాన్ ఇది. అక్టోబర్ చివరివారంలో వచ్చిన ఆర్ణాబ్, ఈ నెల ప్రారంభంలో విరుచుకుపడిన మురాసు వల్ల ఇప్పటికే తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రదేశంలో తీరాన్ని దాటుతుందనే విషయంపై వాతావరణ శాఖ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. సముద్రం తీవ్ర అలజడిగా మారడం, బలమైన గాలులు వీస్తుండటంతో సోమవారం నుంచే మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.






