చీరాల, 2026-11-25
బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 350 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 350 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ వెల్లడించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆయన ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని 43 ప్రాంతాల్లో 88 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని ఆరు జోన్లు, 12 రూట్లుగా విభజించామన్నారు. వీటిలో 19 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. బందోబస్తులో ఒక డీఎస్పీ, ఎనిమిది మంది సీఐలు, 16 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 350 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు 12 మొబైల్ పార్టీలు, ఆరు స్ట్రైకింగ్ పార్టీలు, మూడు స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీలను సిద్ధం చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, గొడవలు, ఘర్షణలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో అనధికార వ్యక్తులు గుంపులుగా చేరకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఓటర్లు క్యూలైన్లలో క్రమశిక్షణతో ఉండేలా చూడాలని సూచించారు. పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతించాలని తెలిపారు.
ఎన్నికల బందోబస్తులో సమర్థ్ మొబైల్ యాప్ కీలకంగా పనిచేయనుందని ఎస్పీ తెలిపారు. ఏదైనా పోలింగ్ కేంద్రం వద్ద సమస్య తలెత్తినప్పుడు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే సమీపంలోని మొబైల్, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీలకు వెంటనే సమాచారం చేరుతుందని వివరించారు. అదే సమయంలో జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కూడా సమాచారం అందుతుందని, యాప్‌లో చూపించే లొకేషన్ ఆధారంగా పోలీస్ బృందాలు వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకుంటాయని చెప్పారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీస్ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్, బాపట్ల డీఎస్పీ సీహెచ్. చంద్రమౌళి, రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, ఏఆర్ డీఎస్పీ పి. కృష్ణంరాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







